mt_logo

ఇటు టీఆర్‌ఎస్‌కు.. అటు టీడీపీకి.. భలే గిరాకీ..!

– కాంగ్రెస్‌కు జెల్లగొడుతున్న నేతలు
– వలసల నిరోధానికి కాంగ్రెస్ పాట్లు
– అధిష్ఠానం హామీతో తగ్గిన నందీశ్వర్, ప్రతాప్‌రెడ్డి!
– టీఆర్‌ఎస్‌లోకి వలసలే వలసలు..
– త్వరలో మరో కీలక టీడీపీ నేత రాక
– టీడీపీలోకి కుతూహలమ్మ, తోట నర్సింహం
– రేపోమాపో డీఎల్, కావూరి, రాయపాటి?
మొన్నటిదాకా ఆయన కాంగ్రెస్‌లో సీనియర్ నేత.. ఇప్పుడు టీడీపీలో! కాంగ్రెస్‌కు నమ్మకస్తుడిగా పేరున్న నాయకుడు.. ఇప్పుడు గులాబీతోటలో! రక్తంకూడా పసుపురంగేనన్న స్థాయిలో విధేయత ప్రకటించిన టీడీపీ నేతలు.. కాంగ్రెస్ కండువాల్లో! జగనంత నాయకుడు లేడని జేజేలు కొట్టినవాళ్లు.. కట్ చేస్తే తలోపార్టీలోకి! రాజకీయాల్లో కప్పదాట్లు సహజమే అయినా.. మునుపెన్నడూ లేనిరీతిలో.. చూడని స్థాయిలో బరువులు మారుతున్న రాజకీయ తరాజులు! మొన్నటిదాకా కింది స్థాయికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ మారే వ్యవహారాలు.. ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడమే 2014 ఓట్ ఫైట్ స్పెషల్! ఈ తతంగంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ భారీగా నష్టపోతుంటే.. సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మాత్రం మంచి గిరాకీ తగులుతున్నది! రానున్న ఎన్నికల్లో రాజకీయ చిత్రంపై విశేష ఆసక్తి రేపుతున్నది!!
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వివిధ రాజకీయ పార్టీల్లోకి నాయకుల వలసలు వేగం పుంజుకుంటున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు సీమాంధ్రలో టీడీపీ పెద్ద ఎత్తున గండికొడుతున్నది. దీంతో ఆ రెండు పార్టీలకు మేకపోతు గాంభీర్యమే దిక్కవుతున్నది. ఇదే సమయంలో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ మరింత బలపడుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు రెండు ప్రాంతాల్లోనూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో సమస్యలు ఎదురైనా.. తెలంగాణ ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో అనుకూల వాతావరణం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావించారు.

టీఆర్‌ఎస్ విలీనం అయితే తెలంగాణలో తమకు తిరుగే ఉండదని, విలీనం కాకపోయినా పొత్తు పెట్టుకుని తిరుగులేని మెజారిటీ సాధించవచ్చని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పొత్తులకోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే రీతిలో కాంగ్రెస్ వ్యవహరించిందని, కనుక ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పరిస్థితులు ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకున్నాయి. టీఆర్‌ఎస్ పొత్తులకు కలిసి రాకపోగా, మరోవైపు కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నారని వినిపిస్తుండటంతో కాంగ్రెస్ మరింత కలవరానికి గురవుతున్నది.

వలసలు ఆపేందుకు స్వయానా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరువు), సీ ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్), టీ నర్సారెడ్డి (గజ్వేల్) టీఆర్‌ఎస్‌లోకి జంప్ అవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. వీరిలో నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మెదక్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి వ్యవహారం నచ్చకనే నందీశ్వర్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు సూచిస్తూ పీసీసీకి, ఏఐసీసీకి భూపాల్‌రెడ్డి పంపించిన ప్యానెల్ జాబితాలో నందీశ్వర్‌గౌడ్ పేరు లేకపోవడం, ఆ స్థానానికి కేవలం ఒకే ఒక పేరును డీసీసీ అధ్యక్షుడు ఆ జాబితాలో సూచించిన వైఖరి నందీశ్వర్‌కు ఆగ్రహం కలిగించిందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

టికెట్ దక్కడం అనుమానంగా మారడంతో నందీశ్వర్, టీఆర్‌ఎస్ నేతలతో మూడు రోజుల క్రితం చర్చలు జరిపినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ నేతలు నందీశ్వర్‌ను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా పటాన్‌చెరువు సీటుపై భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో డీఎస్ నచ్చజెప్పారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తదితరులు పార్టీ హైకమాండ్‌కు విషయం చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాహుల్ నుంచి నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ మెసేజ్ వచ్చింది. మీ విషయంలో నేను స్వయంగా జాగ్రత్త తీసుకుంటాను. మీకు తప్పకుంటా మళ్ళీ పార్టీ టికెట్ ఇస్తాం అని రాహుల్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు నందీశ్వర్‌కు అత్యంత సన్నిహితనేత ఒకరు తెలిపారు.

రాహుల్ నుంచి భరోసా లభించడంతోనే నందీశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళే విషయంలో వెనక్కి వెళ్ళినట్లు పార్టీలో వినిపిస్తోంది. అలాగే టీఆర్‌ఎస్ వైపు వెళుతారంటూ ప్రచారం జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి దిగ్విజయ్, పొన్నాల, ఉత్తం, శ్రీధర్‌బాబుల నుంచి హామీ లభించడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక మెదక్ జిల్లాకు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి సీటు కేటాయింపుపై భరోసా లభించలేదని తెలుస్తోంది. అయితే టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ద్వారా నర్సారెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు, టీఆర్‌ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

సోమవారం ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావ్, కరీంనగర్ జిల్లా పుట్టామధు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాబోయే రెండుమూడు రోజుల్లో ఖమ్మం జిల్లా టీడీపీ కీలక నేత టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్ నుంచి ఒక మాజీ మంత్రి కూడా గులాబీ తోటవైపు చూస్తున్నారని తెలుస్తున్నది. రాబోయే వారం రోజుల్లో భారీ సంఖ్యలో నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెబుతున్నారు.

సీమాంధ్రలో సైతం జంప్‌లు
సీమాంధ్రలో కూడా పరిస్థితి అదే స్థాయిలో ఉంది. అక్కడ టీడీపీవైపు అధికులు చూస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే జీ కుతూహలమ్మ, ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, రమేష్ రెడ్డి, మడకశిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీ రామమూర్తి, చిత్తూరు జిల్లాకు చెందిన తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి జీ శంకర్‌యాదవ్, తిరుపతి నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ, అన్నారామచంద్రయ్య, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌సీరెడ్డి, మదనపల్లెకు చెందిన హరికుమార్, అనంతపురం జిల్లాకు చెందిన దావులూరి రమేశ్‌బాబు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దాపురం నియోజకవర్గం నాయకులు దావులూరి దొరబాబు, అమలాపురంకు చెందిన ఎస్ నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పుత్తూరి రామాంజనేయ రాజు, హనుమాన్‌జంక్షన్‌కు చెందిన వీరమాచినేని ప్రసాద్, ఎనికేపాడుకు చెందిన గోగం బాలకోటేశ్వరరావు, చిలుకలూరి పేటకు చెందిన తేళ్ల సుబ్బారావు తదితరులు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి తోటనర్సింహం, అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కూడా సోమవారం టీడీపీలో చేరారు. తిప్పేస్వామి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి బంధువు కావడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్‌లో మంత్రులుగా పని చేసిన టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, శుత్రుచర్ల విజయరామరాజు, తన కుమారుడు జయదేవ్‌తో కలిసి గల్లా అరుణకుమారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనార్థన్ థాట్రాజ్, లబ్బి వెంకటస్వామి, కే శ్రీధర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటివరకు అనంతపురం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మధుసుధన్‌గుప్తా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలువడంతో ఆయన కూడా ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బరాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. సీమాంధ్ర జిల్లాలకు చెందిన మరి కొందరు కాంగ్రెస్ సిట్టింగ్‌లు, సీనియర్లు టీడీపీ, వైఎస్సార్సీపీలో కర్చీఫ్‌లు వేసుకున్నట్లు సమాచారం. అయితే అక్కడ కూడా పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు వెళ్ళకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు పాటిస్తున్నది. హైకమాండ్‌ను, పార్టీ నేతలను కాదని వెళ్ళిపోయిన వారి స్థానాల్లో రెండవ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించాలని, తద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చవచ్చని అధిష్ఠానం ఆలోచనతో ఉంది. ఇదిలా ఉంటే.. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాయపాటికి నర్సరావుపేట ఎంపీ సీటు ఇవ్వడానికి అంగీకరించి ఇప్పటి వరకు నర్సరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని అసెంబ్లీకి పంపాలని బాబు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో రాయపాటి టీడీపీలో అధికారికంగా చేరుతారని సమాచారం. జేసీ దివాకర్‌రెడ్డి కూడా అతి త్వరలో టీడీపీలో చేరతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీనేత, ఎంపీ సీఎం రమేశ్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలిసింది.

జేఎస్పీలో చేరిన వైఎస్సార్సీపీ నేతలు
తాజా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జేఎస్పీలోకి వైఎస్సార్సీపీ నేతలు వలసపోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు అత్తేటి జోసఫ్, పెద్దకూరపాడు అసెంబ్లీ ఇన్‌చార్జి కొండవీటి దత్తాత్రేయుడు, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొడిచర్ల వెంకటయ్య, బీసీ నాయుడు, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి యూ ప్రసాద్, బీసీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య ఆచారి, కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ సభ్యులు లక్ష్మీనారాయణ, కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారులు గోపీకృష్ణ, రామచంద్రుడులు జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు.

టీఆర్‌ఎస్ జాబితా మరింత ఆలస్యం..!
అన్ని రాజకీయ పార్టీల్లో కంటే టీఆర్‌ఎస్‌లో ఎన్నికల వేడి ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ అంశంపై రాజకీయ పార్టీలు అవలంబించిన విధానాలు టీఆర్‌ఎస్ అనుకూలంగా మారడం, ప్రజల్లో సానుభూతి, పలుకుబడి పెరగడంతో టీఆర్‌ఎస్ టికెట్లకు యమగిరాకీ పెరిగింది. ఇన్నాళ్లూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ పంచన చేరేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *