mt_logo

రైతు పండుగ పేరుతో రేవంత్ రైతులను మరోసారి మోసం చేశారు: హరీష్ రావు

మహబూబ్‌నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.  మహబూబ్‌నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించింది అని విమర్శించారు.

ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు రూ. 15 వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు. ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారు అని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంద.  మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది  అని అడిగారు.

2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యింది? 2014-15 లో లక్షా 31 వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2 లక్షల 21 వేల ఎకరాలకు ఎలా పెరిగింది అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నవు.. పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నావు.. పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా? ఒకసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి, బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటమైతే అటు మాట్లాడటం నీకే చెల్లింది అని ధ్వజమెత్తారు.

మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేసి జైలుకు పంపించావు. ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు. రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటదేమో.. పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్ గారిని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది అని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలసలను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27 వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90 శాతం పూర్తి చేస్తే, ఏడాది పాలనలో మీరు మిగిలిన చివరి పనులు కూడా పూర్తి చెయ్యక చోద్యం చూస్తున్నారు అని ఆరోపించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే అది కూడా మీ ఖాతాలో వేసుకున్నావు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారికి గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా అని సవాల్ విసిరారు.

ఇప్పటికే నీకు కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుంది. మల్లా అవకాశం వస్తదా అని భయపడుతున్నవు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి.. మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నం. మీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదు. అబద్ధాలు చెబుతూ ఏడాది నడిపించావు అని మండిపడ్డారు.

ఈ అబద్ధాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా అని హరీష్ రావు అడిగారు.