mt_logo

ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు

నారాయణపేట జిల్లాలోని మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని మండిపడ్డారు.

వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నది. ఈరోజు నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి.. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి ఆసుపత్రి పాలైన విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.