mt_logo

మూగజీవాల మౌనరోదనను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడం శోచనీయం: హరీష్ రావు

ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత.. 1962 పశు వైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.

వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయం. పశుసంవర్ధక శాఖ కూడా సీఎం వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలుగా నిలిచిపోయింది అని విమర్శించారు. పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రెండు వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇది వారికి అదనపు ఆర్థిక భారమవుతున్నది అని అన్నారు.

మూగజీవాల్లో అంతర పరాన్న జీవులను నివారించేందుకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయి. దీంతో రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగా మారుతున్నాయి. దీంతో వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి అని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు.

పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో మూగజీవాలకు చికిత్స అందించలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితిలో మందుల చిట్టీ రాసి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం పాలైన మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను 1962 నెంబర్‌తో పశువైద్య సంచార వాహనాలను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. దీనిపై ప్రశంసలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది అని గుర్తు చేశారు.

అంతటి గొప్ప కార్యక్రమ నిర్వహణను మీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. సంచార వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతున్నది. మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు అని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మీరు గాని, ఉన్నతాధికారులు గానీ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల సంరక్షణ పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తున్నది. ఇప్పటికే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అటకెక్కించారు, చేపల పంపిణీని ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు మందులు సరఫరా చెయ్యక మూగజీవాల మరణాలకు కారణమవుతున్నారు అని దుయ్యబట్టారు.

వానాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నిపశువైద్య శాలల్లో, పశువైద్య సంచార వాహనాల్లో అవసరమైన మందులు ఉండేలా చూడాలని, నట్టల నివారణ మందులు సరఫరా చేయాలని, 1962 పశువైద్య సంచార వాహనాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.