mt_logo

పాలన వదిలి ముఖ్యమంత్రి, మంత్రుల పక్క రాష్ట్రాల పర్యటన పట్ల హరీష్ రావు ఫైర్

పాలన వదిలి ముఖ్యమంత్రి, మంత్రుల పక్క రాష్ట్రాల పర్యటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోరు అని దుయ్యబట్టారు.

మంత్రి సీతక్క జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించరు. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడరు అని విమర్శించారు.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు అంటే.. ఇవేవీ పట్టనట్లు, రాష్ట్ర ప్రజలకు సమస్యలే లేనట్లు.. ముఖ్యమంత్రి సహా మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారు. పాలన గాలికి వదిలి, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూ కట్టిన పరిస్థితి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని బయల్దేరిన ముఖ్యమంత్రి, మంత్రుల్లారా.. మీరు చెప్పిన మార్పు అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.