mt_logo

కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్


కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు అని దుయ్యబట్టారు.

ఇది ద్వంద్వ నీతి కాదా? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ గారు రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ గారు స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారు అని హరీష్ రావు అన్నారు.