
విద్యావేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ. సాయిబాబా గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగటం శోచనీయం అని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. కానీ దశాబ్ద కాలం పాటు ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం. ప్రొఫెసర్‌గా పని చేస్తూ, ఆ హోదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారు అని విచారం వ్యక్తం చేశారు.
వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది న్యాయ సూత్రం. ఇది సాయిబాబా గారి విషయంలో వర్తిస్తుంది. సాయిబాబా గారు పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.
90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టీ నిర్బంధించడం బాధాకరం. నిర్దోషిగా బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగటం బాధాకరం అని హరీష్ రావు అన్నారు.
తన కండ్లు, శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు.