తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడ్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ్తారు. రేవంత్ రెడ్డి మాటలపై ప్రజలకు నమ్మకం పోతోంది అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.
మల్లన్న సాగర్‌లో 50,000 ఎకరాలు ముపునకు గురైందని ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ సేకరించిన భూమి 17,871 ఎకరాలు. అందులో 3,280 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉంది. మొత్తం సేకరించిన భూమి 14,591 ఎకరాలు మాత్రమే. మరి 50 వేల ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించారు.
నిర్వాసితులకు 2013 చట్టం కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చినం. అవన్నీ ప్రభుత్వ రికార్డులే. తెప్పించుకుని చూడు కళ్ళు తెరిచి మాట్లాడు. గోబల్స్ సిగ్గుపడే లాగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, మళ్లీ వచ్చి మల్కాజ్‌గిరిలో పోటీ చేశాడు. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని మాట తప్పాడు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలుస్తారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
31 రకాల సాకులతో రుణమాఫీ ఎగ్గొట్టారు. దాన్ని పూర్తి రుణమాఫీ కాదు.. పాక్షిక రుణమాఫీ అంటారు. ఏడాది పూర్తి అవుతుంది. ఇంకా పూర్తి క్యాబినెట్ వేయలేక పోయావ్. రాష్ట్రం సమస్యల కుప్పగా మారింది. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు పక్కన పెట్టీ రాజకీయాలు చేస్తున్నావ్. కేసీఆర్‌కి నీకు పోలిక పొంతన ఉందా.. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది అని విమర్శించారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? రాకపోతే నువు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుండేనా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష. కేసీఆర్ ఇస్ ఏ సేవియర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయి అని జోస్యం చెప్పారు.
సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నాడు. వచ్చేది బీఆర్ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్ ప్రజలు డిసైడ్ అయ్యారు అని అన్నారు.
దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్‌కు హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేడు అని దుయ్యబట్టారు.
ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గవర్నర్‌ను కలిశాడు. ఇంకో మంత్రి హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగాడు. మరో మంత్రి ఏమో ఢిల్లీకి వెళ్లాడు. కొంత మంది మేము సీఎం అవుతామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నీ కుర్చీ ఎవరు లాగుతారో చూసుకో అని ఎద్దేవా చేశారు.
మూసీ ప్రాజెక్టు అభివృద్ధికి మేం అనుకూలం.. కానీ, మూసీ సుందరీకరణ పేరిట కమిషన్ల కోసం పేదల ఇండ్లు కులగొడతామంటే మేము వ్యతిరేకం కొండ పోచమ్మ సాగర్ నుండి మూసికి నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ డీపీఆర్ చేశారు. మీరు కొండ పోచమ్మ సాగర్ కాకుండా మల్లన్నసాగర్ నుండి ఎందుకు మరుస్తున్నారు. రూ. 1,100 కోట్లతో అయ్యే పనిని రూ. 7,000 కోట్లకు కమిషన్ కోసం పెంచారు అని ఆరోపించారు
గచ్చిబౌలిలో ప్రభుత్వం 500 ఎకరాలు కోర్టు కేసులో ప్రభుత్వం గెలిచింది. ఆ భూమిని మూసి బాధితులకు ఇవ్వండి. ఈ భూమిని అమ్ముకొని రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మల్లన్నసాగర్‌లో మేము నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారం కంటే ఎక్కువ మూసి బాధితులకు ఇవ్వండి. మేము 250 గజాల్లో డబల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చాం. ఉపాధి ఇచ్చాం. 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షలు ఇచ్చాం అని గుర్తు చేశారు.
ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయటం అన్యాయం. ఏక్ పోలీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ చెప్పలేదా? తనకు రక్షణ కల్పించే పోలీసులపై కూడా రేవంత్‌కు నమ్మకం లేకుండా పోయింది. తండ్రే తన పిల్లలను నమ్మనట్లు రేవంత్ తీరుంది. కానిస్టేబుల్స్ సమస్యలు తెలుసుకునే సమయం లేదా సీఎంకు? అని అడిగారు.
బాపూ ఘాట్‌లో భారీ గాంధీ విగ్రహాం పెడితే స్వాగతిస్తాం. కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టడు.. ప్రజలు దర్శించుకునే అవకాశం ఇవ్వడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగంబజార్‌లో నాపై కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి తప్పిదాల వలన హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది అని మండిపడ్డారు.
నీకు ఫుట్‌బాల్ ఒక్కటే వచ్చు.. నాకు క్రికెట్ మాత్రమే తెలుసు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గోల్ కొట్టేది మేమే.. వికెట్ తీసేది మేమే. ఈ లోపు హిట్ వికెట్ కాకుండా చూసుకో రేవంత్. నీ మంత్రులే నిన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్‌తో పాదయాత్రకు రెడీ. రేపా? ఎల్లుండా? టైం చెప్తే కేటీఆర్, నేను ఇద్దరం వస్తాం. గన్‌మెన్లు లేకుండా రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలి అని హరీష్ రావు సవాల్ విసిరారు.
నన్ను డీల్ చేయటం సంగతి కాదు.. మెదటి రేవంత్ సొంత కుర్చీని కాపాడుకోవాలి. రేవంత్‌ను ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నాం. అసెంబ్లీ సాక్షిగా, పూర్తి ఆధారాలతో రాష్ట్ర అప్పుల గురించి చెప్పిన. పాడిందే పాటరా పాచిపండ్ల దాసరా అన్నట్లు ముఖ్యమంత్రి అవే అబద్దాలు చెబుతున్నడు అని విమర్శించారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం చేసిన అప్పు రూ. 4,26,499 కోట్లు మాత్రమే. కానీ గడిచిన పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసిన అప్పు రూ. 51,188 కోట్లు. జూలై 26 నాటికే రూ. 24,887 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తీసుకున్నట్లు అసెంబ్లీలనే చెప్పారు. తర్వాత టీఎస్‌కాబ్ ఎన్సీడీసీ నుంచి మరో రూ. 5 వేల కోట్లు తీసుకున్నరు. ఇవి గాక ఇతర సంస్థల నుంచి మరో 2,3 వేల కోట్లు తీసుకున్నరు. ఇట్ల మొత్తం పది నెలల కాలంలోనే రూ. 85 వేల కోట్ల దాకా అప్పు తీసుకున్నట్లు క్లియర్‌గా ఉన్నది అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బడ్జేటేతర రుణాల వివరాలను కాగ్‌కే చెప్పలేదని కాగే తన సెప్టెంబర్ నివేదికలో చెప్పింది. అది రూ. 85 వేల కోట్లా, లక్ష కోట్లా అనేది కాగ్‌కు ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు దాస్తున్నరు. తీసుకున్న రుణాలను ఏం చేస్తున్నరు. రేవంత్ బెదిరింపులకు ఎవరు భయపడరు అని పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రశ్నించే గొంతుక.. కేటీఆర్‌పై పగపడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. ఫార్ములా రేసింగ్‌పై ఏసీబీ విచారణ చేయనివ్వండి. ఏమి కేసులు పెడతారో చూస్తాం అని అన్నారు.