ఆంధ్రా సర్కార్ పీపీఏ రద్దు కోరుతూ ఈఆర్సీ కి లేఖ రాయడంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడుతూ, ‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మీ సెక్రెటేరియట్, అసెంబ్లీ ఇక్కడినుండే పనిచేయాలి. మీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. మీ ఇళ్ళకు, కార్యాలయాలకు కరెంటు అవసరం లేదా? చంద్రబాబు ఒకటి చేస్తే మేం పది చేయాల్సి వస్తుంది. తెలుగు ప్రజలంతా ఒకటేనని, సమన్యాయం అని మాట్లాడే బాబు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని తెలంగాణకు కరెంటు రానివ్వకుండా చేయాలని చూడటం సమంజసం కాదు.’ అని అన్నారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ను రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడుతుందని, తెలంగాణకు రావాల్సిన 460 మెగావాట్ల విద్యుత్ కోల్పోవాల్సి వస్తుందని, దానివల్ల వచ్చే కష్టనష్టాలకు సీమాంధ్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీష్ రావు హెచ్చరించారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై పీపీఏ రద్దుపై ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీపీఏ రద్దు నిర్ణయం ఏకపక్షమని, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని, రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడవటమేనని స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణకు ఎలాంటి కరెంటు లోటు రాకుండా చూస్తామని భరోసా ఇచ్చిందని హరీష్ తెలిపారు.