చంద్రబాబు సర్కారు 300 ఎకరాలు, మిగతా సీమాంధ్రులు 327 ఎకరాల గురుకుల ట్రస్ట్ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నీతి, నిజాయితీ ఏమాత్రం లేని సీమాంధ్ర భూబకాసురులు అనాధపిల్లల ఆశ్రయం కోసం, పాఠశాలల కోసం పుణ్యాత్ములు ఇచ్చిన గురుకుల ట్రస్ట్ భూమిని అప్పనంగా కాజేశారు. ఇన్నాళ్ళూ హద్దూ ఆపూ లేకుండా అక్రమాలకు తెగబడ్డ వాళ్లకు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యమం జరిగే సమయంలోనే అక్రమార్కుల భాగోతం బయటపెట్టిన కేసీఆర్ ఆనాటి సీమాంధ్ర పాలకులకు సవాల్ కూడా విసిరారు.
నిన్నటి దాకా అయన ఒక ఉద్యమకారుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా. ఆయన మాటే వేదం. అన్యాయాన్ని ఏమాత్రం సహించని కేసీఆర్ పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే అక్రమార్కుల భరతం పట్టడానికి కార్యోన్ముఖులయ్యారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న గురుకుల ట్రస్ట్ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం అయినా సహించేది లేదని, ట్రస్ట్ భూములపై 2008లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అసలు విషయానికి వస్తే గురుకుల ట్రస్ట్ అనేది ఒక ఆదర్శనీయమైన విద్యాసంస్థ. ఒక ధర్మనిధి. తొలి రోజుల్లో అది కొందరు గొప్పవాళ్ళ చేతుల్లోనే ఉండి సేవలందించింది. కానీ కొన్నాళ్ళకు ట్రస్ట్ ను సీమాంధ్ర బడాబాబులు భ్రష్టు పట్టించారు. బన్సీలాల్ అనే ఒక ఆదర్శవాది అందరికీ వేదవిద్యతో పాటు సాంకేతిక విద్యను అందించాలనే పవిత్ర లక్ష్యంతో 627 ఎకరాలతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్ళకు ఆస్తుల నిర్వహణ మీరు చేయలేరంటూ ప్రభుత్వం ఆ భూములను ట్రస్ట్ నిర్వాహకుల దగ్గరనుండి స్వాధీనం చేసుకుని భూ కబ్జాలకు మార్గం క్లియర్ చేసింది.
గురుకుల ట్రస్ట్ భూముల్లో అధిక శాతం నిర్మాణాలు సీమాంధ్రకు చెందిన వారివే. వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గ్రేటర్ మున్సిపల్ అధికారులు పక్షపాత వైఖరితో సీమాంధ్రకు చెందిన వారి కట్టడాల జోలికి వెళ్ళలేదు. 120 ఎకరాల స్థలంలో నాక్ బిల్డింగ్, 100 ఎకరాల భూమిని నోవాటెల్ హోటల్ కు, 30 ఎకరాల భూమిని హ్యుందాయ్ కార్ల షోరూంకు, హెచ్ఎండీఏ కు కొన్ని ఎకరాలు ఇచ్చారు.
చంద్రబాబు 5 ఎకరాల భూమిని కొని అమ్మగా, ఆయన భార్య భువనేశ్వరి ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పురంధేశ్వరి, డీఎల్ రవీంద్రారెడ్డి, వివేకానంద రెడ్డి, వైఎస్ నమ్మినబంటు సూరి, దానం నాగేందర్, అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వందలమంది భూ బకాసురులు ఈ భూముల్ని కబ్జా చేశారు.