mt_logo

అట్టహాసంగా జరిగిన తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ

ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మహాసభ ఘనంగా జరిగింది. ఇప్పటివరకూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరంగా పనిచేసిన టీజేఎఫ్ మార్చి 9 నుండీ టీయూడబ్ల్యూజే గా ఆవిర్భవించింది. కార్యక్రమానికి నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ అధ్యక్షత వహించగా అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు హాజరయ్యారు. వేలసంఖ్యలో వచ్చిన తెలంగాణ పదిజిల్లాల జర్నలిస్టులు మన రాష్ట్రంలో మన యూనియన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ అలలు అలలుగా కదిలివచ్చిన వేలాది మంది జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే సముద్రమంత సంస్థ అని రుజువుచేశారని జర్నలిస్టులను కీర్తించారు. ఎన్నో అవాంతరాలను అధిగమించుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందరికీ హక్కులు లభించే తెలంగాణ అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ స్టేట్ లో నిరంకుశ ప్రభుత్వం రాజ్యమేలిందని, తెలంగాణను మిలిటరీ పాలకులు వారి ఇనుప పాదాల కింద పాలించారని, 1940దశకంలో జరిగిన ఉద్యమంలో పోలీసుల దారుణచర్యలతో 20వేలమంది మరణించారని చెప్పారు. ఇంత చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతూ నిందలతో, అసత్య ప్రచారాలతో గందరగోళ వాతావరణం సృష్టించారని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి, చిరునవ్వుల తెలంగాణ నిర్మాణానికి జర్నలిస్టులే ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. పద్నాలుగేళ్ళుగా టీఆర్ఎస్, ఇతర తెలంగాణ ఉద్యమ సంస్థలతో కలిసి ప్రయాణించి తెలంగాణ ప్రజలను చైతన్య పరచడంలో టీజేఎఫ్ తనదైన పాత్రను పోషించిందని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అవసరమైన సదుపాయాలన్నిటినీ రేపటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా సమకూరుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశం గర్వించేలా టీయూడబ్ల్యూజే భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో అన్ని సౌకర్యాలతో కూడిన పరిశోధనా కేంద్రం, సమావేశ మందిరం, తెలంగాణ ప్రెస్ అకాడెమీ, జర్నలిస్టుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులందరికీ ఇళ్ళు, బస్సులో ప్రయాణించడానికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణ జర్నలిస్టులపై ఉన్న కేసులన్నిటినీ ఎత్తివేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *