ఆహార భద్రతా కార్డులు, పెన్షన్లు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెల మొదటివారం నుండి పెంచిన పెన్షన్లు ఇవ్వాలని, ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వీటికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటుండటంతో తహసీల్దార్ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఇచ్చిన గడువు ఒక్కరోజే ఉండటం, దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గడువును ఈనెల 20 వరకు పొడిగించింది.
ఇదిలాఉండగా ఆహార భద్రత కార్డు కోసం తెల్ల కాగితంపై కుటుంబ వివరాలు రాసిస్తే సరిపోతుందని, కొత్త కార్డులు ఇచ్చేవరకు పాత కార్డులపైనే బియ్యం ఇస్తామని ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు బ్రోకర్ల మాటలు నమ్మొద్దని, కరెంట్ కొరతపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, రెండు రాష్ట్రాలు రెండు కళ్ళన్న చంద్రబాబు తెలంగాణకు కరెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్యలు తీరతాయని, ఈ విషయాన్ని రైతులు అర్ధం చేసుకోవాలని ఈటెల విజ్ఞప్తి చేశారు.
