తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావును గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే అయినందున ఆ రోజే ఉదయం 8.15 గంటలకు రాజ్ భవన్ దర్బార్ హాలులో కేసీఆర్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి గవర్నర్ పంపిన అధికారిక లేఖ గురువారం కేసీఆర్ కు అందింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని పోలీసుల గౌరవవందనం స్వీకరించనున్నారు. అనంతరం సచివాలయం చేరుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేరోజు ఉదయం 6.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ నరసింహన్ తో ప్రమాణస్వీకారం చేయిస్తారు.