గవర్నర్ కు అదనపు బాధ్యతలు ఇవ్వాలని కేంద్రం భావించడం లేదని, గవర్నర్ కు ఎలాంటి బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలో పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో చాలా స్పష్టంగా ఉందని, అంతకు మించి అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. అయితే గతంలో ఏపీ సీఎం గవర్నర్ కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. వెంటనే గవర్నర్ కు మరిన్ని బాధ్యతలు అంటూ కేంద్ర హోం శాఖ ఒక సర్క్యులర్ ను తెలంగాణ రాష్ట్రానికి పంపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండిపడి అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై యుద్ధం చేస్తామని ప్రకటించగానే కేంద్రం వెనక్కు తగ్గింది.
గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులయిన రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులతో సమావేశం నిర్వహించిన అనిల్ గోస్వామి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చట్టంలోని బాధ్యతలు, అధికారాలు అదనంగా కొన్ని గవర్నర్ కు కట్టబెట్టినట్లయితే మళ్ళీ సవరణ చేసినట్లే అవుతుందని, అందుకు అవసరమైన ఆర్డినెన్స్ రూపొందించడం, ఇరు రాష్ట్రాల శాసనసభలకు పంపడం, రాష్ట్రపతి ఆమోదం పొందటం, మళ్ళీ పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిపి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ గా మారడం లాంటి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే పోలవరం అంశంలో రాద్ధాంతం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో సమస్య కొనితెచ్చుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని దీనినిబట్టి చూస్తే స్పష్టమవుతుంది.