ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్ మంగళవారం సీఎం శ్రీ కేసీఆర్ ను కలిసి రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, భాషా పండితులతో పాటు పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేజీబీవీ లలో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలలపాటు జీతాలు ఇవ్వాలని, మహిళా టీచర్లకు మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని, రూ. 398 జీతంతో పనిచేస్తున్న 11,363 మంది టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరామన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అపరిష్కృతంగా ఉన్న నేపధ్యంలో యాజమాన్యాల వారీగా టీచర్లకు ప్రమోషన్లు కల్పించేలా విధానాలు చేయాలని.. ఎయిడెడ్, మోడల్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు ఆరోగ్య కార్డులను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరామని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.