తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసంలో మిగతా బోనాలకంటే ముందుగా వచ్చే ఈ బోనాలను తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. బోనాల పండుగ, రంజాన్ మాస ఉపవాస దీక్ష ప్రారంభం ఒకే రోజు రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గంగా జమునా తెహజీబ్ కు మారుపేరుగా నిలిచే హైదరాబాద్ నగరంలో మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపుకు స్వాగతం పలికారు. ఉత్సవ విగ్రహాలకు సారె పోసేందుకు మహిళలు పోటీ పడ్డారు. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఆలయంలో బోనం, తొట్టెల సమర్పణతో తొలి పూజ పూర్తయింది. ఈ ఉత్సవానికి దాదాపు లక్షమంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.