ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగాల్సి ఉంది. పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మెదక్ జిల్లాకు వచ్చిన హరీష్ రావుకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
జిల్లాకు చేరుకున్న ఆయన మొదట సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత శరభేశ్వరాలయంలో పూజలు, చర్చిలో ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి సమానంగా ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి హరీష్ రావు అమర్ నాథ్ యాత్రికుల కోసం వంటసామాగరి సరుకులు తరలించే లారీకి జెండా ఊపి ప్రారంభించారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమమని, తన సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఇష్టదైవమైన కోనాయిపల్లి వేంకటేశ్వరాలయాన్ని దర్శించుకున్న హరీష్ రావు మంత్రిగా తనకు వచ్చే మొదటినెల జీతాన్ని హుండీలో వేస్తానని, ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విరాళాలుగా సిద్ధిపేట ప్రజలు ఇచ్చిన 1,40,782 రూపాయలను హరీష్ రావు ముడుపు విప్పి మొక్కు చెల్లించారు.