శ్రీశైలం ప్రాజెక్టుపై రోజుకో తీరుగా అబద్ధాలను చెప్తూ తెలంగాణ ప్రభుత్వంపైనే బురద చల్లాలని చూస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పై భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జీవోలు సరిగ్గా చదువుకోలేదంటూ దేవినేని ఉమ, పరకాల ప్రభాకర్ చెప్పడాన్ని హరీష్ తీవ్రంగా తప్పుబట్టారు.
సోమవారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఏఏ జీవోల్లో ఏముందో చదివి వినిపించారు. జీవో కాపీలను వారికి పంపిస్తున్నామని, జీవో నం. 233 ను తాను బయట పెట్టేవరకు ఆంధ్రా బాబులు మాట్లాడలేదని, జీవోలో 4 పేరాలు ఉందని, ఏఏ పేరా ఏం చెబుతుందో వాళ్ళు తెలుసుకోవాలని అన్నారు. తొమ్మిదేళ్ళు పాలించిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చారో స్పష్టం చేయాలని, అప్పుడే మూడు ప్రాంతాల ప్రజలకు నిజానిజాలు అర్ధమవుతాయని హరీష్ డిమాండ్ చేశారు.
మీ ఆటలు ఇప్పుడు సాగవని, ఒక్క చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదని, జీవో నం. 69 ప్రకారం నీటిని పక్కాగా వినియోగించుకుంటామని, మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని హరీష్ రావు తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజాదరణ పొందుతుండటంతో టీడీపీ దుకాణం ఖాళీ అవుతున్నదని, రోజుకో ఎమ్మెల్యే జారిపోతుండటంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క జీవోనూ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని, జీవో నం. 233 అసలు శ్రీశైలం నీటికి సంబంధించింది కానే కాదంటూ ఏపీ సర్కార్ వాదించడాన్ని చెప్తూ జీవోలపై వారికున్న అవగాహనాస్థాయి అంతేనని విమర్శించారు.