అసెంబ్లీలో చర్చ జరక్కుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో విభజన ప్రక్రియ ముందుకు సాగట్లేదని పలువురు టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అందువలన విభజన బిల్లుపై రాతపూర్వక అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపడం ద్వారా సమయం వృధా కాదని, రాజ్యాంగ బద్ధమైన ఈ ప్రక్రియ ద్వారా విభజన వేగవంతం అవుతుందని అంటున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా వారు అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు తయారు చేసి వాటిని స్పీకర్ కు పంపించడంద్వారా వారి అభిప్రాయాలు కూడా రాతపూర్వకంగా ఇస్తున్నట్లు భావించవచ్చు. మరో రెండు రోజుల్లో ముగియనున్న శాసనసభ సమావేశాల్లో బిల్లుపై చర్చ జరిగే అవకాశం లేదని, సభను నిరవధికంగా వాయిదా వేసి సభ్యుల లిఖితపూర్వక అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇతర రాష్ట్రాల విభజన విషయంలో అసెంబ్లీలో రెండు, మూడు రోజులకంటే ఎక్కువ సమయం చర్చకు ఇవ్వలేదని, తెలంగాణ విషయంలో కూడా అలాంటి నియమాలే పాటించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. స్పీకర్ ను కలిసి ఈ విషయంపై వివరణ ఇవ్వనున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మాత్రం చర్చ జరగకపోతే వారిప్రాంతానికి కావలిసిన ప్యాకేజీలు, అభివృద్ధి గురించి వాదించడం కుదరదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుపై చర్చ జరక్కుండా వాయిదా వేస్తున్నారని పలువురు సీమాంధ్ర టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.