జీవో 107 గురించి గొప్పగా చెప్తున్న ఏపీ సర్కారు అదే జీవో 107 ను సవరిస్తూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జారీ చేసిన మరో జీవో 233 విషయాన్ని ఎందుకు దాస్తున్నారని, శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంలో ఆంధ్రా సర్కార్ వాదనలన్నీ కాకి లెక్కలేనని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం సచివాలయంలో మన ఊరు-మన చెరువు కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం 9 వేల చెరువుల పునరుద్ధరణ జరపాలని నిర్ణయించామని, రూ. 4500 కోట్లతో చేపడుతున్న ఈ పనులన్నీ టెండర్ విధానం, ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానంలో జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
జీవో 107 కు సవరణగా వచ్చిన జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు 34 టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాత మిగతా నీటిని 834 అడుగుల వరకూ వాడుకోవచ్చని, ఆ విషయాన్ని ఏపీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ ఎందుకు ప్రస్తావించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. వైఎస్ ఈ జీవో జారీ చేసినప్పుడు తమ ఉద్యమం వల్లే 233 సవరణ జీవో జారీ అయ్యిందని దేవినేని గతంలో గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు మళ్ళీ మాటమార్చి 107 జీవో గురించి మాట్లాడుతున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పంటలను ఎండబెట్టి రైతుల నోట్లో మట్టికొట్టేందుకే ఏపీ సర్కారు కుట్రలు చేస్తుందని, రాష్ట్ర విభజన ప్రకారం తెలంగాణకు రావాల్సిన 54 శాతం విద్యుత్ ను ఇవ్వకుండా శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తిని ఆపేస్తే 300 మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. 54 శాతం కింద వెయ్యి మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు రావాల్సి ఉండగా, 300 మెగావాట్లు ఇవ్వడమేమిటని, తెలంగాణకు దానం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చట్టాలు, జీవోల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటివాటాలను, విద్యుత్ ను వాడుకొని తీరుతామని హరీష్ తేల్చిచెప్పారు.