హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాలను వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు తెలిపారు. దీనివల్ల 15 వేల నుండి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఎయిర్ పోర్ట్ పరిసరాల్లోనే 50 ఎకరాల విస్తీర్ణంలో లక్ష చదరపు మీటర్లలో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను జీఎంఆర్ ప్రతినిధులు కలిసి అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనలు వివరించారు.
సిటీ ఏర్పాటుకు రూ. 750 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందించాలని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ ఎయిర్ పోర్ట్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, ఎయిర్ పోర్ట్ సిటీ ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, హైదరాబాద్ నగరానికి ఉత్తరం వైపున కూడా మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో హాస్పిటల్, నేచర్ క్యూర్ కేంద్రం, ప్రపంచస్థాయి థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.