గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికులు, డ్రైవర్ల జీతాలు 47.05% పెంచినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం ప్రకటించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24 వేలమందికి పైగా కార్మికులకు లాభం చేకూరనుంది. పెరిగిన జీతాలను జూలై నెలనుండే వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జీతాలు పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాజ్ మోహన్ రెడ్డి, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య అన్నారు.
ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ. 8,500 వేతనం వస్తుండగా, దాన్ని రూ. 4వేలు పెంచి రూ. 12,500 చేశారు. మరోవైపు డ్రైవర్లకు ప్రస్తుతం రూ. 10,200 వేతనం వస్తుండగా దానిని రూ. 4,800 కు పెంచి రూ. 15,000 కు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటికి సమ్మె విరమించిన వారందరికీ ఈనెల నుండే వేతనాల పెంపు అమలు చేయాలని, ఇంకా విధుల్లో చేరని ఉద్యోగులను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. ఇదిలాఉండగా జీతాలు పెరిగిన ప్రతిసారీ కొందరు నాయకులు ఒక్కో ఉద్యోగి నుండి రూ. వెయ్యి వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కార్మికులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, ఇకపై ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.