కొద్దిరోజుల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని సీఎం కే చంద్రశేఖర్ రావు పార్టీనేతలకు సూచించారు. గ్రేటర్ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం నాలుగు డివిజన్లకు తక్కువకాకుండా ఎన్నికల్లో సత్తా చాటాలని, బల్దియాలో గులాబీ జెండా ఎగరేయాలని ఆదేశించారు. ఆదివారం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టీ రాజయ్య, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలపై పట్టుసాధించి తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఏర్పడాలని, అవసరమైతే మజ్లిస్ తో కలిసి అవగాహన కుదుర్చుకొని ముందుకుపోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కేశవరావుకు బాధ్యతలు అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశాలను ఆగస్టు 15లోగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు సీఎం అప్పగించారు.