- ఓటరు ముసాయిదా సవరణకు సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన కమిషనర్
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఉపాద్యాయుడిగా సరికొత్త పాత్ర వహించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న దానకిషోర్ నేడు సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 350 మందికిపైగా హాజరైన పర్యవేక్షక అధికారులను ఉద్దేశించి స్వచ్ఛ ఓటర్ల జాబితాను ఏవిధంగా తయారుచేయాలి, ఇల్లు మారిన, మరణించిన వారి ఓటర్లు ఎలా తొలగించాలి, 18 ఏళ్లు నిండినవారిని ఓటర్లుగా నమోదు చేయించడం పై చేసిన ప్రసంగం ఉపాధ్యాయుడి మాదిరిగా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది.
ఈ మూడు రోజుల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో చేపట్టనున్న ఓటర్ల జాబితా విస్తృత సర్వే ఏవిధంగా చేపట్టాలనే అంశంపై పూసగుచ్చినట్టుగా సూక్ష్మస్థాయి జాగ్రత్తలను కూడా దానకిషోర్ వివరించారు. జూనియర్ అసిస్టెంట్‌ల నుండి సీనియర్ అసిస్టెంట్‌లు, సూపరింటెండెంట్‌లు, ఏసీపీలు, ఇంజనీర్లు ఇలా వివిధ హోదాలకు చెందిన 350మందికి పైగా సిబ్బంది, అధికారులను ఓటర్ల జాబితా సవరణకు అదనంగా నియమించారు. బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఈ నెల ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో సవరణలు, నూతన ఓటర్ల నమోదు తదితర పనుల్లో నిమగ్నమైన విషయం విదితమే. వీరికి తోడు ప్రతి ఏడు పోలింగ్ బూత్‌లకు ఒక పర్యవేక్షకులుగా ఈ 350మందిని దానకిషోర్ ప్రత్యేకంగా నియమించారు. ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుపై నేడు కమిషనర్ దానకిషోర్ చేసిన మార్గదర్శకం స్పష్టంగా ఉందని, ఈ సమావేశానికి హాజరైన పలువురు అధికారులు పేర్కొన్నారు.