పోలవరంపై అక్రమ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగసంఘాల జేఏసీ, ప్రజాసంఘాల జేఏసీ, కార్మిక సంఘాల జేఏసీ, ఉపాధ్యాయసంఘాల జేఏసీ, న్యూ డెమోక్రసీ, సీపీఎం, సీపీఐ పూర్తి మద్దతు ప్రకటించాయి. శ్రీరాంపూర్, సింగరేణి డివిజన్ లోని ఆర్కే – 7 గనివద్ద టీబీజేకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. బుధవారం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
తెలంగాణ పదిజిల్లాలలో వర్తక, వాణిజ్య, వ్యాపార, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ యూనియన్లు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నాయి. అన్ని ఆర్టీసీ డిపోల్లో ఎక్కడి బస్సులక్కడే ఆగిపోయాయి. సింగరేణి కార్మికులు నల్ల బాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్డినెన్స్ వెనక్కు తీసుకోకపోతే పోరాటం ఆగదని యావత్ తెలంగాణ వాదులు తేల్చిచెప్తున్నారు. తెలంగాణ పదిజిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. సీమాంధ్ర నేతలైన చంద్రబాబు, వెంకయ్యనాయుడు కనుసన్నల్లో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.