రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికి ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలతో పాటు వికారాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డిలో కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పనున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే 2022-2023 సంవత్సరానికి రాష్ట్రం నుండి సంగారెడ్డి, మహబూబబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల, రామగుండం, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఒక్కో వైద్య కళాశాల చొప్పున 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా.. అదనంగా మరో నాలుగు వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదయోగ్యం తెలిపారు.వీటి అనుమతుల కోసం వచ్చే ఏడాది జాతీయ వైద్య కమిషన్ కు ప్రతిపాదనలు పంపనున్నారు.
ముందుగా ఈ 8 కళాశాలల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే ఏడాది వరకు ఎలాగైనా వీటిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు అధికారులు తెలియజేసారు. అందులో భాగంగా రామగుండం (సింగరేణి) కళాశాలకు మినహా మిగతా వైద్య కళాశాలల పోస్టులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే ఒక్కో కళాశాలకు 150 సీట్ల చొప్పున 1200 వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయం మీద సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ “ఇప్పటి వరకు నీటి పారుదల, వ్యవసాయం మీద దృష్టి సారించానని.. ఇకనుండి విద్య, వైద్యం మీద దృష్టి కేద్రీకరిస్తానని.. వీటి అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రణాళికను రూపొందించాలని” సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.