ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, రెండు సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే మణెమ్మ కన్నుమూసారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్ రావు సంతాపం వ్యక్తం చేసారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1986 లో భర్త అంజయ్య మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన మణెమ్మ సికింద్రాబాద్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, జనతాదళ్ అభ్యర్ధిగా పోటీచేసి, రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కొన్నాళ్ళు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2004 నుండీ మళ్ళీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2008, 2009 సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మణెమ్మ పార్థీవ దేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని ఆమె గృహానికి తరలించారు. సోమవారం మహాప్రస్థానం లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.