ఏ అధికారం లేని తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని, ఎవరికోసం ఉమ్మడి ప్రతిపాదనలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ వోవైసీ మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో స్పష్టం చేశారు. హైదరాబాదు, తెలంగాణ రెండూ ఒక్కటేనని, వేరువేరు కాదని, హైదరాబాదును యూటీ చేయొద్దని కోరారు. ఉమ్మడి రాజధానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, తప్పదనుకుంటే రెండేళ్ళు మాత్రమే ఖైరతాబాద్ మండలపరిధికి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లులో అన్నీ ఉమ్మడి అధికారాలే ఉన్నాయని, అసలు టీ నేతలు బిల్లును చదివారా? అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ కమిషనర్ చేతిలో ఉంటే ఇంక సీఎం ఎందుకు? మొత్తం అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని, డిల్లీ పోలీస్ విధానం ఐతే సీఎం రోడ్ల మీద ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు నూతనంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉంటే ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కృషి చేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల ప్రయోజనం లేదని, కలిస్తే సంఘ్ పరివార్ కు స్థానం కల్పించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం ఐదువేల కోట్ల ప్యాకేజీ, చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.