mt_logo

గోల్కొండ ఖిల్లాపై జాతీయజెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

68వ స్వాతంత్ర్య వేడుకలు గోల్కొండ కోటలో ఘనంగా జరిగాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ చేరుకొని అమర జవానులకు నివాళులర్పించారు.

ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు రాజధాని హైదరాబాద్ మకుటాయమానమని, నవ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, బ్రిటన్ పార్లమెంటులో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి ప్రతీక గోల్కొండ కోటని, ప్రపంచ ప్రసిద్ధి పొందిన వజ్ర, వైడూర్యాల వ్యాపార కేంద్రం ఈ గోల్కొండ కోట అని ప్రశంసించారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిజామాబాద్ ఎర్రజొన్న రైతులకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఆటో కార్మికులకు పన్ను రద్దు చేశామని, ట్రాక్టర్లు, ట్రాలీల పన్ను బకాయిలను కూడా రద్దు చేసామని అన్నారు. గిరిజనులకు, ముస్లింలకు ఇచ్చిన మాటకోసం 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, దసరా నుండి దీపావళి మధ్యకాలంలో వృద్ధులకు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్లు అందజేస్తామని, రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

గోల్కొండ వేదికగా కామన్వెల్త్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను సీఎం సన్మానించి వారికి నగదు పురస్కారాలను అందజేశారు. ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లతో పాటు వారి కోచ్ శేఖర్ బాబును సీఎం శాలువాలతో సత్కరించి ఒక్కొక్కరికి 25లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఇచ్చిన మాటప్రకారం దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని గోల్కొండ కోట వేదికగా సీఎం ప్రారంభించారు. ఒక్కో జిల్లానుండి ఇద్దరు లబ్దిదారులను ఎంపిక చేసి భూమి పట్టాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *