mt_logo

తెలంగాణ అసెంబ్లీలో తొలి బీఏసీ సమావేశం..

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9నుండి జరుగుతున్న సందర్భంలో బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ తరపున డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి, చిన్నారెడ్డి, టీడీపీ నుండి ఎర్రబెల్లి, ఎంఐఎం తరపున పాషాఖాద్రి, బీజేపీ నుండి లక్ష్మణ్ సభ్యులుగా హాజరయ్యారు. సీపీఐ నుండి రవీంద్రనాయక్, సీపీఎం నుండి సున్నం రాజయ్య, వైసీపీ నుండి తాటి వెంకటేశ్వర్లు బీఏసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

ఇదిలా ఉండగా బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. 12,13 తేదీల్లో సభ సాయంత్రం వరకు జరుగనుంది. డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. 12వ తేదీన స్పీకర్ మధుసూదనాచారి డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. అదేరోజు అనగా గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండాసురేఖ ముందుగా చర్చను ప్రారంభిస్తారు. బుధవారం శాసనసభ, శాసనమండలి ఉభయసభల నుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఆమె ప్రారంభిస్తారు.

13వ తేదీన వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తారు. 14వ తేదీన తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన విద్యార్థి, యువకుల బలిదానాలపై, హిమాచల్ ప్రదేశ్ ఘటనపై చర్చ జరగుతుంది. తర్వాత పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానంపై కూడా చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *