ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ సమతుల్యత శాఖ బుధవారం తుది అనుమతులు మంజూరు చేసింది. చెన్నైలోని అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారికంగా ఈ ఉత్తర్వులు జారీచేసింది. ఆరునెలల క్రితమే ఈ ప్రాజెక్టుకు తొలిదశ అనుమతులు లభించగా, ఈ ప్రాజెక్టు కింద 1531. 0548 హెక్టార్ల అటవీభూమిని బదలాయించడానికి అనుమతిస్తూ కొన్ని షరతులు విధించారు. అన్ని అడ్డంకులు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టగా తాజాగా తుది అనుమతులు మంజూరు అయ్యాయి.
అటవీ సంరక్షణ చట్టం 1980 సెక్షన్ 2 కింద వచ్చిన తాజా అనుమతుల నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం డివిజన్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని అటవీ ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్ట్ లో భాగంగా కాల్వలు, సొరంగమార్గాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రూ. 7,967 కోట్ల అంచనాతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని 25 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలోని ఒక మండలంలో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి మొత్తం 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా వందలాది గ్రామాల తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టు ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుంది.