పేద విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెలంగాణ విద్యార్థులకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు డీ శ్రీనివాస్, గీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ క్రిష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పథకం అమలుకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన విధివిధానాలనే కొనసాగించాలని, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని, నాన్ లోకల్ విద్యార్థులు తెలంగాణలో విద్యనభ్యసించినా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది లేదని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై 2,547కోట్ల భారం పడుతుందని సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలకు చెప్పారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 14.32లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని, ఏఎఫ్ఆర్సీ నిర్ణయం మేరకే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజు ఆ రాష్ట్రమే భరించాలని, విద్యార్థుల స్థానికతను వారి సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తిస్తామని ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పథకం అమలులో మొదట్లో రూపొందించిన విధానాలనే కొనసాగించాలని, ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజులు ఆ రాష్ట్రమే చెల్లించలాన్న ప్రతిపాదనకు తాము మద్దతిచ్చామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ క్రిష్ణయ్య అన్నారు.