టీఆర్ఎస్ లోకి రోజురోజుకీ భారీగా వలసలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. ఇందులోభాగంగా మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, కాంగ్రెస్ నేత స్వామిచరణ్, బీజేపీ నేత నరేంద్రనాథ్, రెండుపార్టీలకు చెందిన కార్యకర్తలు భారీసంఖ్యలో సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టీ రాజయ్య, భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు, ఎమ్మెల్యే బాబూమోహన్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ప్రజలకు సేవ చేసేందుకు వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరుతున్నారని, మెదక్ జిల్లానుండి వస్తున్న చేరికలతో టీఆర్ఎస్ మరింత బలపడిందని చెప్పారు. బీజేపీ నేత నరేంద్రనాథ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గత మూడునెలలుగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్ లో చేరామని, ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని, అందులో భాగస్వాములై మెదక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని వివరించారు.