తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ సీఎంవో పేరిట ఫేస్ బుక్ అకౌంట్ ను ప్రారంభించనుంది. హైదరాబాద్ ను వైఫై సిటీగా మారుస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఫేస్ బుక్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూపొందించబోయే సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఈ ఫేస్ బుక్ బాగా ఉపయోగపడుతుంది.
విద్యార్థులు, ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్ లోకి తెలంగాణ సీఎంవో పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నారు. ముఖ్యమంత్రి చేపట్టే అధికారిక సమీక్షలు, కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ సీఎం ఫేస్‌బుక్ లో పొందుపరుస్తారు.
స్వదేశంలోనే కాకుండా, విదేశాలనుండి సైతం ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, విమర్శలు సీఎంకు ఫేస్‌బుక్ ద్వారా పోస్ట్ చేయవచ్చు. ఇప్పటికే తెలంగాణ సీఎంవో ఫేస్‌బుక్ ను ప్రభుత్వ ఐటీ శాఖ ట్రయల్ రన్స్ ప్రారంభించింది. అధికారికంగా దీనిని సోమవారం లేదా, మంగళవారం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా సమాధానాలు కూడా ఇస్తారు. తెలంగాణ సీఎంవో ఫేస్‌బుక్ నిర్వహణ పూర్తిగా సీఎంవో కార్యాలయం అధీనంలోనే ఉంటుంది.
సీఎం కేసీఆర్ ఫేస్‌బుక్, ట్విట్టర్ లలో అభిప్రాయాలు తెలిపేందుకు www.facebook.com/telanganacmo లో లాగిన్ కావచ్చు. www.twitter.com/telanganacmo లో పోస్ట్ చేయవచ్చు.