mt_logo

ఎవరు పెత్తందార్లు?

ఫొటో: తెలంగాణ అమరుడు ఇషాన్ రెడ్డి ఇంటి ముందునుండి పాదయాత్ర ప్రారంభిస్తున్న మొగుడంపల్లి ఆశప్ప (తెల్ల అంగీ వేసుకుని పిడికిలి బిగించిన యువకుడు)   

By: మొగుడంపల్లి ఆశప్ప

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఇకపై తెలంగాణ ప్రాంత మంత్రులనే టార్గెట్ చేయాలని జేఏసీ ఇచ్చిన పిలుపునందుకొని నేను, మరికొందరు స్థానిక విద్యార్ధులం కలిసి మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జహీరాబాద్ నియోజకవర్గంలో పదిరోజులపాటు పాదయాత్ర నిర్వహించినం. మా పాదయాత్ర ముగింపు సభ 11 నవంబర్ నాడు జహీరాబాదులో జరిపినం. వేలాదిమంది ప్రజలు పాల్గొన్న ఆనాటి సభలో అంతకు ముందు వారమే ఉస్మానియాలో ఆత్మబలిదానానికి పాల్పడ్డ సంతోష్‌ను తలుచుకుని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చాలా ఆవేదనకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాకుండా ఇక్కడ యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా కేవలం పదవుల యావలో పడి కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంత నేతలను కోదండరాం నిశితంగా విమర్శించారు.

ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒక సీమాంధ్ర దినపత్రిక కుట్రపూరితంగా వక్రీకరించింది. దాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి గీతారెడ్డి కోదండరాంపై ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడమే కాక ఆయనొక పెత్తందారుగా వ్యవహరిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తిగా ఈ రెండు మాటలు మీకు తెలియజేస్తున్నాను.

మాది జహీరాబాద్ దగ్గరలోని మొగడంపల్లి గ్రామం. ఒక దళిత కుటుంబానికి చెందిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ, ఇక్కడ స్టూడెంట్ జేఏసీ నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసులు నాపై డజన్ల కొద్దీ కేసులు పెట్టి అరెస్టు చేసి, జైలుకు పంపినప్పుడు కొంతమంది విద్యార్థి మిత్రులు నన్ను బెయిల్ ఇప్పించి విడిపించవలసిందిగా మంత్రి గీతారెడ్డి వద్దకు పోయిండ్రు. ఆమె ఆ విద్యార్ధులతో చాలా నిర్ల్యక్షంగా మాట్లాడారు. “ఆశప్ప నాకు చెప్పి జైలుకు పోయిండా? నేనెందుకు పట్టించుకోవాలె” అని అన్నారు.

ఆమె గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎవరు ఉద్యమంలో పాల్గొన్నా పోలీసులచే వేధింపులకు గురిచేస్తూ జహీరాబాదును తన స్వంత జాగీరుగా మలుచుకున్నారు.

నవంబర్ 2నాడు నేను పాదయాత్ర మొదలుపెట్టింది ఉస్మానియాలో బలిదానం చేసిన అమరుడు ఇషాంత్‌రెడ్డి ఇంటి ముందునుంచి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను దళితుడినని, ఇషాంత్‌రెడ్డిది అగ్రకులమని నేను భావించలేదు. నా వరకు నాకు తెలంగాణలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ఉద్యమకారుల కులం, రెండోది తెలంగాణ ద్రోహుల కులం. తెలంగాణ కోసం బలిదానం చేసిన వారెవరూ తమ కులాల కోసం ఆ త్యాగం చేయలేదు. అంతటి మహోన్నత త్యాగం చేసిన అమరులున్న ఈ గడ్డ మీదే కొంతమంది ద్రోహులు మాత్రం కులాలపేరిట ఉద్యమాన్ని చీల్చే నీచమైన కుట్రలు పన్నుతున్నరు.

నా పాదయాత్రలో భాగంగా ఒకరోజు వర్షం పడుతుంటే తలదాచుకోవడానికి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి పోతే కొద్దిసేపటికే పోలీసులు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేశారు. ఆ విషయం తెలిసి స్థానిక గ్రామస్థులు మా బృందానికి తమ ఇళ్లలోనే ఆశ్రయం ఇచ్చారు. పాదయాత్ర సాగిన అన్ని గ్రామాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్పందన చూసిన మంత్రి గీతారెడ్డి పోలీసులను మాపై ఉసిగొల్పి అనేక ఇబ్బందులు సృష్టించారు.

జహీరాబాద్ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నా, అందులో 90 శాతం సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారు. ఈ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నం చేయమని స్థానికులు మొరపెట్టుకున్నా గీతారెడ్డి ఎన్నడూ పట్టించుకోలేదు.

మా ప్రాంతంలో చెరుకు రైతులు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సంబంధిత శాఖా మంత్రి అయిన గీతారెడ్డి ఆ రైతులను ఆదుకునే చర్యలు ఏమీ చేపట్టలేదు. ఆమె పేరుకు దళితురాలిని అని చెప్పుకుంటున్నా స్వంత పార్టీలోని స్థానిక పదవులన్నీ అగ్రకులాలకే కట్టబెడుతున్నరు. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా గీతారెడ్డి సీమాంధ్ర కోడలుగానే వ్యవహరించారు తప్ప తెలంగాణ బిడ్డగా ఏనాడూ వ్యవహరించలేదు. ఉద్యమాన్ని సోపానంగా చేసుకొని పదవుల కోసం పైరవీలు చేయడంలోనే ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు.

దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో మమేకమై తన కులాన్ని ఏనాడో మరచిపోయిన ప్రొఫెసర్ కోదండరాం పెత్తందారు కాదు. తన పేరు చివర అగ్రకులపు తోకను తగిలించుకుని, వందలాది యువతీయువకుల బలిదానాలు జరుగుతుంటే కూడా తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అనుకుంటూ, జహీరాబాదును తన జాగీరు చేసుకున్న గీతారెడ్డే నా దృష్టిలో అసలుసిసలు పెత్తందారు.

(నమస్తే తెలంగాణలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *