By: గుణవీర శరత్‌చంద్ర
—
నెమలి పింఛము ధరించిన ప్రతిఒక్కడు వాసుదేవుడు కాదు
శంఖుచక్రము చేతిబూనినంత మాత్రాన చక్రధారి కాలేడు
నీతులు చెప్పే ప్రతివాడూ గీతాకారుడు కాలేడు
నల్లనల్లని వాళ్లంతా శ్రీకృష్ణులు కాలేరు
పత్రిక పెట్టిన ప్రతివాడూ పరమపురుషుడు కాదు
కలము పట్టిన ప్రతివాడూ కాలజ్ఞాని కాలేడు!
ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ తాను వాసుదేవుడినని (బహుశా చంద్రబాబు అర్జునుడని మనసులో ఉండి ఉంటుంది), తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కేసీఆర్ పౌండ్రకవాసుదేవుడని నిందిస్తున్నాడు. ప్రజలు తనను, తన పత్రికను నమ్మకుండా కేసీఆర్‌ను ఎలా నమ్ముతున్నారని ఏడుస్తున్నాడు? ప్రజలెప్పుడూ తప్పులే చేస్తున్నారని విలపిస్తున్నాడు. మాటిమాటికి ప్రజలను తప్పు పట్టే మహానికృష్ట జర్నలిస్టులను, మేధావులను ప్రపంచంలో ఎక్కడయినా చూశారా?
ప్రజలు నిన్ను నమ్మకపోతే అది నీ తప్పు
ప్రజలు నిన్ను తిరస్కరిస్తే అది నీ లోపం
ప్రజల విశ్వాసంకోల్పోతే అది నీ నిర్వాకం
ప్రజలు ఓట్లు వేయకపోతే అది నీ వైఫల్యం
ఇది రాధాకృష్ణకు, చంద్రబాబులకే కాదు,
కేసీఆర్‌కూ, టీఆరెస్‌కూ వర్తిస్తుంది!
……
ప్రజలు నమ్మినవాడు వాసుదేవుడు
ప్రజలు మెచ్చినవాడు దేవదేవుడు
ప్రజలను నిందించినవాడు,
ప్రజలను వేధించినవాడు,
తనే దేవుడినని నమ్మించాలని చూసినవాడు
హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, శిశుపాలుడు, పౌండ్రకుడు
ఇతిహాసమంతా చెప్పింది ఇదే!
రాధాకృష్ణ వీళ్లలో ఎవరి పాత్ర పోషిస్తున్నారు?
……..
వాసుదేవుడు తనను నమ్మాలని ప్రజలను కోరలేదు
తనను కొలవాలని ప్రజలను యాచించలేదు
నేనే వాసుదేవుడనని నమ్మించడానికి వేషాలు వేయలేదు
కొనుక్కొచ్చిన నెమలిపించం, అల్లుకొచ్చిన పూలమాలలు
చేయించిన శంఖుచక్రాలు ధరించలేదు!
పౌండ్రకుడు వేషాలు వేశాడు
తానే అవతరాపురుషుడినన్నాడు
తననే అందరూ నమ్మాలన్నాడు
నమ్మకపోతే చస్తారన్నాడు
వాసుదేవునివద్దకు దూతను పంపి పేరు మార్చుకొమ్మన్నాడు
లేకపోతే యుద్ధంలో తలతీసేస్తానన్నాడు
చివరకు తలతీయించుకున్నాడు
…..
రాధాకృష్ణ
తననే నమ్మాలని ప్రజలను వేధిస్తున్నాడు
తాను చెప్పేవే నిజాలని, తాను చెప్పేవే నీతులని
అందరూ ఒప్పుకుని తీరాలని పట్టుబడుతున్నాడు
విలువలు లేక రాష్ట్రం వలువలూడిపోతున్నాయని
తాను చూడలేకపోతున్నాని మథనపడుతున్నాడు
డబ్బు జబ్బు వంటిదని, డబ్బు ప్రమేయంలేని రాజకీయాలు కావాలని
కార్పొరేట్ కళాశాలల డబ్బుతో సభలు పెట్టి హితబోధలు చేస్తున్నాడు
తనను నమ్మకపోతే నాశనమైపోతారని శపిస్తున్నాడు
ఇప్పుడు చెప్పండి- పౌండ్రక వాసుదేవుడెవరు?
రాధాకృష్ణా? కేసీఆరా?