ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ భయపడుతున్నారు. ముందుగా ఆ భయాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ అన్నారు.. దేశంలో నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగినా దానిని అనుసరించామని, ఆ చికిత్సలను మన వారికి అందిస్తున్నాము అని తెలిపారు.
పట్టణ పేద ప్రజల ముంగిటికి వైద్యం సేవలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలను తీసుకువచ్చాము. ఇప్పటికే 200 ప్రారంభించాము. మరో 100 బస్తీ దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తము. బస్తీ దవాఖానాలో సాయంత్రం క్లినిక్ లు కూడా ప్రారంభించాము. బస్తీ దవాఖానాలో మందులకు కొదవ లేదు. UPHC, బస్తీ దవాఖానాలో 145 చోట్ల కరోనా టెస్టులు చేస్తున్నాము. ఇవి కాకుండా మొబైల్ క్యాంప్ లు కూడా పెడుతున్నాము. వారం రోజుల నుండి తెలంగాణలో రోజుకు 50 నుండి 60 వేల టెస్టులు చేస్తున్నాము. కరోనాను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే పరీక్షల సంఖ్య పెంచామని అన్నారు.
దేశంలో మరణాల శాతం కంటే తెలంగాణలో మరణాల శాతం తక్కువ ఉంది. మన రాష్ట్రంలో మరణాల శాతం 0.7 మాత్రమే. కరోనా వల్ల పజల్లో కలుగుతుంది ఒకటి భయం అయితే మరోటి సోషల్ స్టిగ్. వీటిని పోగొట్టాల్సిన భాద్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ అసోసియేషన్ ముందుకు రావాలి. కరోనా వచ్చింది అని వారిని వెలి వేసినట్లు చూడడం మంచిది కాదు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధించవచ్చు అనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. ప్రభుత్వం ప్రజలు కలిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు అని ఆయన ఆలోచన, మీరందరూ కూడా కరోనాపై పోరాటంలో కలిసి రావాలి అని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను మంత్రి కోరారు.
అన్ని బస్తీల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అవసరం అయితే స్వయంగా తానే వచ్చి పాల్గొంటానని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్, క్లబ్ హౌజ్ లను ఇస్తే అక్కడ ఉన్న వారికి మందులు, భోజనం ప్రభుత్వం నుండి అందజేస్తామని మంత్రి సూచించారు. పరీక్షలు, చికిత్స ఎక్కడ అందుతుంది వివరాలు తెలియజేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటుచేస్తాం అని తెలిపారు. ఈ కరోనా అనేక అనుభవాలను, బాధలను, అవమానాలను ఎదుర్కొనే లా చేసింది. అయినా ప్రజలకు విశ్వాసం కల్పించి వారిని కాపాడుకోవడంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు.
కరోనాకు చంపే శక్తి లేదు.. నిర్లక్షం వహిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసొలేషన్ కిట్లు ఇస్తున్నాము. 95 శాతం మందికి హాస్పిటల్ చికిత్స అవసరం లేకుండానే నయం అవుతుంది. 5 శాతం మందిలోనే చికిత్స అవసరం. వారికి కూడా అతి ఎక్కువగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం 30 లక్షల రూపాయలు వసూలు చేయడం సబబు కాదని, ఈ సమయంలో వ్యాపారం చేయవద్దని వారికి చెప్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కి వెళ్లి అప్పుల పాలు కావద్దు అని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, DME రమేష్ రెడ్డి, DH శ్రీనివాస్ రావు తదితరులు హాజరయ్యారు.