మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని వెల్లడిస్తున్నది. చేసిన పనీ చక్కటిది కాదు. చేసిన విధానమూ చక్కగా లేదు. తెలంగాణ ప్రాంతాన్ని ఇంత నిరంకుశంగా మరో ప్రాంతానికి బదిలీ చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, సమైఖ్య స్ఫూర్తికి భంగకరం. స్థానిక గిరిజనుల మనుగడకూ ప్రమాదకరం. సీమాంధ్ర పెత్తందారులు, కేంద్ర పాలకులు కలిసి చేసిన నేరమిది. ఏ కోణంలో చూసినా ఇది ప్రాంతాల బదిలీ కాదు, సామ్రాజ్యవాద దురాక్రమణ.
పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు, అత్యవసర పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఆర్డినెన్స్ విధానాన్ని రాజ్యాంగంలో కల్పించారు. కానీ అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ఆర్డినెన్స్ జారీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. కొత్త పార్లమెంటు సమావేశమయ్యే వరకు మోడీ క్యాబినెట్ వేచి ఉండాల్సింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నోటిఫికేషన్ గెజిట్‌లోకి ఎక్కింది. కొత్త రాష్ట్ర ఏర్పాటు లాంఛనం వారం రోజులు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలోని ప్రాంతాన్ని మరో రాష్ట్రంలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్‌కు విరుద్ధం.
సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించకుండా అందులోని ప్రాంతాలను మరో రాష్ట్రానికి బదిలీ చేయడం సమైఖ్య స్ఫూర్తికి భంగకరం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నప్పటికీ వాటి అభ్యంతరాలు పట్టించుకోకుండా మొరటుగా వ్యవహరించడం కూడా సమైఖ్య విధానానికి విరుద్ధమే. ప్రజాస్వామ్యంపై, సమైఖ్య విధానంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా మోడీ క్యాబినెట్ ఈ ఆర్డినెన్స్ జారీ చేయకపోవలసింది. మోడీకి అనుభవం లేదనుకున్నా సుష్మా స్వరాజ్, జైట్లీ, రాజ్‌నాథ్ వంటి సీనియర్ నాయకులు ఆయనకు సలహా ఇవ్వవలసింది. బీజేపీలోని పెద్దలయినా మోడీకి హితవు చెప్పాల్సింది. దేశంలోని పెత్తందారులు ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కి ఇష్టారీతిన ఆర్డినెన్స్‌లు జారీ చేయించుకునే విధానం దేశానికే చేటు తెస్తుంది. అవగాహన రాహిత్యంతో తీసుకునే ఇటువంటి అధర్మ నిర్ణయాలు అనేక ఉద్రిక్తతలకు దారి తీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణోద్యమం సాగుతున్నప్పుడు- కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం సమైఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వాదించింది సీమాంధ్ర పెత్తందారులే. ఆ పెత్తందారులే ఇప్పుడు తెలంగాణ ప్రాంతాలను సీమాంధ్రకు కేటాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణమైంది. కానీ ముంపు ప్రాంతాల బదిలీ గిరిజనుల మనుగడకు ముప్పు తెచ్చేది. దీనివల్ల వారి సాంస్కృతిక, సామూహిక జీవన విధానం ఛిద్రమవుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల అడవులకు కూడా నష్టం జరుగుతుంది. అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, వివాదం కోర్టులో ఉన్నప్పటికీ కేంద్రం అన్ని విలువలను కాలరాచి యథేచ్ఛగా ఆర్డినెన్స్ జారీ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ.
టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ గడ్డపై మహానాడు జరుపుకుంటూ తాము ఇక్కడ అధికారానికి వస్తామంటూ ఎచ్చులకు పోయిండు. ఇక్కడ సామాజిక నవ తెలంగాణ అంటూ డ్రామాలు ఆడుతూనే మరోవైపు గిరిజనులను నిండా ముంచే ఆర్డినెన్స్ జారీకి కుట్ర పన్నడం అతడి మోసపూరిత స్వభావాన్ని వెల్లడిస్తున్నది. తెలంగాణ వ్యతిరేక ఆర్డినెన్స్ జారీ చేయడానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారమే నిర్ణయం తీసుకున్నప్పటికీ, మహానాడు ముగిసే వరకు రహస్యంగా పెట్టారు.
ఈ డ్రామాల వల్ల తెలుస్తున్నదేమిటి? ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం రేపు ఇంకేమి చేస్తుందనే ఆందోళన కలుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పంచాయతీ తెగి పోలేదనీ, సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ సమాజాన్ని పరిపరి విధాల వెంటాడుతూనే ఉంటారని స్పష్టంగా తెలుస్తున్నది. అరవై ఏండ్లుగా తెలంగాణ ప్రజలను అణచివేయడానికి సీమాంధ్ర పాలకులకు సహకరించిన కేంద్రం ఇక ముందు కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని రూఢీ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సీమాంధ్ర పెత్తందారుల ఒత్తిడి వల్ల కేంద్రం అనేక కొర్రీలు పెట్టింది. ఇప్పటికీ హైదరాబాద్‌పై ఆంక్షలు ఉన్నాయి. ఉద్యోగుల పంపకం తేలలేదు. ఆస్తులు, అప్పుల పంపకాలలో తిరకాసులు ఉన్నాయి. నీటి పంపకాలూ జరగవలసి ఉన్నది.
ఈ తగాదాల పరిష్కారంలో కేంద్రం ఇట్లా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోతే చివరికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రజలు ఎంత సంయమనంతో వ్యవహరించినా సీమాంధ్ర పెత్తందారులు ఉద్రిక్తతలు సృష్టిస్తూ రెచ్చగొడుతూనే ఉన్నారు. కయ్యాలు సృష్టించి హైదరాబాద్‌ను కబ్జా చేయడం కూడా వారి ఎత్తుగడలో భాగమే. తెలంగాణ సమాజం వెంటనే అప్రమత్తం కావాలె. అయితే సీమాంధ్ర పెత్తందారులు మైండ్‌గేమ్స్ ఆడుతున్నప్పుడు విచక్షణ, విజ్ఞత కోల్పోకూడదు. వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ సాధించుకోగలిగాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పరాయి శక్తులకు అవకాశం ఇవ్వకుండా సహనంతో, వ్యూహాత్మకంగా, సమైక్యంగా పోరాడాలె. మన హక్కులు సాధించుకోవాలె. మన గడ్డపై మన పాలన సాగించుకోవాలె.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..