mt_logo

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన – ప్రొ. కోదండరాం

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు సోమవారం నాంపల్లిలోని విద్యాశాఖ కమిషనరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు. వారికి సంఘీభావంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంద్ర ఉద్యోగులను తెలంగాణకు, తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు కేటాయిస్తూ సీమాంధ్ర అధికారులు రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నారని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు.

గతంలో ముల్కి నిబంధనలు అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగా ఆంద్ర ఉద్యోగులు ఆందోళన చేశారని, పెద్దమనుషుల ఒప్పందం ప్రకారమే తెలంగాణలో స్థానికత రిజర్వేషన్లపై కేంద్రం గ్యారంటీ కల్పించిందని ఆయన గుర్తుచేశారు. 610 జీవో, గిర్ గ్లానీ కమిషన్ నివేదికను అమలు చేయకపోవడం మూలంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాజ్యాంగానికి లోబడి ఉద్యోగుల విభజన జరగాలని కోదండరాం సూచించారు.

తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంద్ర ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేయాలని విఠల్ పేర్కొన్నారు. ఒక అటెండర్ పోస్టు కోసం గతంలో ఆంద్ర ఉద్యమం జరిగిందని, 75 వేల తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొడుతుంటే తెలంగాణ ఉద్యమం జరిగిందని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ గుర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జేఏసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *