తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసింది. ఈనెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, 31వ తేదీలోపు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు అదేసలామేరకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, రాష్ట్రంలోని 23 సహాయ కేంద్రాల్లో గురువారం నుండి సర్టిఫికెట్ల పరిశీలన మొదలవుతుందని చెప్పారు.
వెబ్ కౌన్సిలింగ్ తేదీలపై చర్చించేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులతో సమావేశం కానున్నామని, ఈనెల 20లేదా 23నుండి ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు పరిశీలిస్తున్నామని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా వెబ్ కౌన్సిలింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడిగానే సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఉమ్మడి అడ్మిషన్ల విధానాన్ని కొనసాగిస్తామని, రోజుకు 25వేల ర్యాంకుల వరకు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పాపిరెడ్డి వివరించారు.