mt_logo

టీఆర్ఎస్ లో ఎన్నికల జోరు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ పూర్తి రాజకీయ పార్టీగా మారింది. స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అసాధారణ రీతిలో విజయం సాధించడానికి అన్ని పార్టీల కంటే ముందుగానే  టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమౌతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించే బాధ్యతను చేపట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నియామకం దాదాపు ఖరారు అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేలు 26 మంది కాగా వీరిలో ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాగా మరో ఇద్దరు ఎవరనే విషయం తెలియలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 12మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంది. లోక్ సభకు పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులు వీరే. పెద్దపల్లి: జీ వివేక్, కరీంనగర్: బీ వినోద్, ఆదిలాబాద్: నగేష్, మెదక్: కేసీఆర్, చేవెళ్ళ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్: కవిత, మహబూబ్ నగర్: జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్: మందా జగన్నాథం, వరంగల్: కడియం శ్రీహరి, మహబూబాబాద్: సీతారాం నాయక్, నల్గొండ: డైరెక్టర్ శంకర్, భువనగిరి: డాక్టర్    నర్సయ్యలుగా నిర్ణయించినట్లు తెలిసింది. సికింద్రాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి సామ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఎంపీ గా నరేష్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల ఎంపికలో పరిస్థితులకనుగుణంగా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *