శనివారంతో ముగియాల్సిన శాసనసభా సమావేశాలు మరో వారంపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సభ పొడిగింపుపై చర్చించారు.
సోమవారం నుండి గురువారం వరకు వర్కింగ్ లంచ్ తో రెండు పూటలా సమావేశాలు నిర్వహించాలని, ఉదయం ప్రశ్నోత్తరాల సమయం, తర్వాత జీరో అవర్, ఆ తర్వాత పద్దులపై చర్చ చేపట్టాలని తీర్మానించారు. 27 కల్లా బడ్జెట్ పద్దులపై చర్చ ముగించి 28 వ తేదీన ఉదయం శాసనసభలో, మధ్యాహ్నం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 29వ తేదీన కొత్త పారిశ్రామిక విధానం వంటి కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిపి సమావేశాలను ముగించనున్నారు. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై సీఎం కేసీఆర్ ఆసక్తి కనపరిచారని, ప్రభుత్వమే ఇలా ముందుకు రావడంపై పలువురు ప్రతిపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.