తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఖాతాలో మొత్తం ఏడు జెడ్పీ స్థానాలు చేరనున్నాయి. మొత్తం 9 జడ్పీలలో ఏడు స్థానాల్లో గులాబీ జెండా ఎగురనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జడ్పీ చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన మెజారిటీ ప్రజా పరిషత్ లు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మూడు జిల్లాల్లో తిరుగులేని విజయం సాధించింది.
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ సొంతం చేసుకున్న టీఆర్ఎస్, మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీలు కారెక్కడంతో నాలుగో జెడ్పీ కూడా టీఆర్ఎస్ సొంతమైంది. మరోవైపు ఆదిలాబాద్ కు చెందిన బీఎస్పీ జెడ్పీటీసీలు కూడా గులాబీ గూటికి చేరడం, మరో ముగ్గురు కాంగ్రెస్ కు చెందిన జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో ఆదిలాబాద్ జెడ్పీ స్థానం కూడా టీఆర్ఎస్ సొంతం కానుంది.
కరీంనగర్ లో 57 జడ్పీటీసీలకు గానూ 41 స్థానాలు టీఆర్ఎస్ సొంతం చేసుకోగా, ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీలు ఇంటి పార్టీ టీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో 36 జడ్పీటీసీలు ఉండగా టీఆర్ఎస్ కు 24 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా జడ్పీ చైర్మన్ ను దక్కించుకోవడంలో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. వరంగల్ జిల్లాలో 50 జడ్పీటీసీలు ఉండగా, టీఆర్ఎస్ పార్టీకి 18 స్థానాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్, టీడీపీల నుండి 10మంది, ఇండిపెండెంట్ ఒకరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ కూడా జడ్పీ చైర్మన్ సీటు దక్కించుకునే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 33జడ్పీటీసీలు ఉండగా, టీఆర్ఎస్ పార్టీ 12 జడ్పీటీసీలు దక్కించుకుంది. జెడ్పీ స్థానం దక్కించుకోవడానికి మరో ఐదు జడ్పీటీసీలు కావాల్సి ఉండగా, టీడీపీ నుండి 7గురు జడ్పీటీసీలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ నుండి కూడా ముగ్గురు జడ్పీటీసీలు చేరనున్నారని సమాచారం. దీనితో రంగారెడ్డిలో జడ్పీ స్థానం కైవసం చేసుకోవడానికి పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ కూడా జడ్పీ సీటు కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్ పార్టీ స్పీడ్ మీదుంది.