గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ (GTWCA) ఆద్వర్యంలో 11 అక్టోబర్, శుక్రవారం సాయంత్రం, దుబాయిలోని మంజార్ పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగినాయి. ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు దంపతులు, మాజీ పార్లమెంటు సభ్యురాలు సుగుణ కుమారి మరియు TRS పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరైనారు. విదేశాలలో కూడ మన తెలంగాణ చిహ్నమైన బతుకమ్మ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడంపై హరీష్ రావు, నిర్వాహకులను కొనియాడారు. దాదాపుగా 300 పైగా మహిళలు అందమైన బతుకమ్మలు పేర్చి దాదాపు 4 గంటలకు పైగా నిర్విరామంగా బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు శాస్త్రోక్తంగా గౌరీ పూజ చేసి, అరేబియా సముద్రంలో నిమజ్జనం చేసినారు. ఆడపడుచులు వాయినాలు ఇచ్చి, సద్దులు పంచినారు.
పండగలకు దూరంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు భారీ సంఖ్యలో ఉత్సవాలలో పాల్గొన్నారు. పురుషులు కోలాటాలు ఆడి కార్యక్రమానికి రక్తి కట్టించారు. గల్ఫ్ దేశాలలో మొట్టమొదట సారిగా బతుకమ్మ ను నిర్వహించిన GTWCA గడచిన 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రతి సంవత్సరం రెట్టించిన ఉత్సాహంతో జరుపుతున్నారు. అందమైన బతుకమ్మలకు హరీష్ రావు దంపతులు బహుమతులు ప్రధానం చేసారు.
ఈ పండుగను ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ మహిళలే ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయానికి ఆద్వర్యం వహించిన గల్ఫ్ తెలంగాణ అసొసియెషన్ మహిళలు పావని, శ్రీదేవి, జయా, శారద, ఫిర్దోస్, జిజియ, రమ, సక్కు బాయి, సంధ్యా , లత, మాలతి, క్రిష్ణవేణి, మాధవి లను అందరూ ప్రశంసించారు.