శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో బడ్జెట్ బిల్లు ఈరోజే గవర్నర్ కు చేరాలని, సభ్యులంతా ఇందుకు సహకరించాలని కోరారు.
పాల సేకరణ ధర అసమానతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖామంత్రి పోచారం సమాధానం ఇస్తూ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీని కాపాడేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించిందని గుర్తుచేశారు. 13 ఏళ్లుగా జరగని పనిని సీఎం కేసీఆర్ ఒక్క నిమిషంలో చేశారని, విజయ డెయిరీకి నేరుగా పాలు పోసే రైతులకు సీఎం రూ. 4 ప్రోత్సాహకం ప్రకటించారని చెప్పారు.
అనంతరం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన ప్రణాళిక ఒక మంచి కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేయడం సంతోషకరమని, రోడ్ల విస్తరణ చేపట్టడాన్ని అభినందిస్తున్నామని చెప్పారు.