By: అమ్మంగి వేణుగోపాల్
ఆధునిక జీవితంలో వేగం ప్రధానమైనది. ఆ వేగాన్ని అందుకోవటానికి నీరసించిన నిన్నటి ఆలోచనాధోరణి పనికిరాదు. కాలానుగుణమైన తక్షణ చర్యలతో భవిష్యత్తును నిర్మించేవారితోనే ప్రజలు మమేకమవుతారు. తెలంగాణ సంక్షేమ పథకాల ప్రయోగశాలగా చేసి గొప్ప ఫలితాలు రాబట్టిన కేసీఆర్‌కు దేశం పట్టంకట్టే ఘట్టం కనుచూపు మేరలో కనిపిస్తున్నది.
నిన్నటివరకు కేసీఆర్ దిల్దార్, కల్దార్. ఇప్పుడు జాతీయవాదపు సర్దార్. గత నాలుగున్నరేండ్లుగా కేసీఆర్ సమసమాజ లక్ష్యంతో గౌరవప్రదమైన జీవితంవైపు తెలంగాణ సమాజాన్ని నడిపిస్తున్నారు. ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కళ్యాణలక్ష్మీ/షాదీముబారక్, రైతుబంధు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ మొదలైన అనేక పథకాలతో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందుకు ఏ ముఖ్యమంత్రి అయినా దిల్దార్ అయి వుండాలె. విశాలమైన హృదయంతో నిరుపేదల కష్టాలు, సమస్యలు అవగాహన చేసుకోవాలె. వీటిని అమలుచేయడానికి కావాల్సింది కోట్లాది నిధులు, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ. తెలంగాణ ధనిక రాష్ట్రం కావటం వల్ల, సకాలంలో పన్నులు చెల్లించే ఆదర్శ సమాజం అవటం వల్ల ప్రతి నిరుపేద కలలను సాకారం చేయటానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. సంక్షేమ పథకాల అమలుకే ప్రథమ తాంబూలం ఇస్తూ తాను దిల్దార్ మాత్రమే కాక కల్దార్ కూడా అని నిరూపించుకున్నారు.
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలలో కొన్నైనా ఎందుకు అమలు చేయలేదన్నది సమాజం ఎక్కుపెడుతున్న ప్రశ్న. లోభి బతుకుల ఆంధ్రాలాబీ తెలంగాణను దోచుకునే వ్యూహాలను మాత్రం బాగానే అమలు చేసింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ సెక్రటేరియట్, ఇతర కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల విభజన, విద్యుత్ శాఖల బకాయీలు, కృష్ణా జలాల వాటా వంటి విషయంలో చంద్రబాబు కక్షపూరితంగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన మళ్లీ గెలిస్తే సీమాంధ్రకే కాదు, తెలంగాణకు కూడా ఇబ్బందులు తప్పవు.
దేశంలోని హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవుల వంటి విభిన్న మతాల వారిని ఒకే జాతిలోని సమానస్థాయి కలిగిన పౌరులుగా భావించటం జాతీయవాదం. రాజ్యాంగం చెప్పే లౌకికవాదాన్ని అందరూ గౌరవించాలె. చంద్రబాబు, కాంగ్రెస్ తదితర పార్టీలతో జతగట్టి ఏర్పరిచిన కూటమి కేవలం అధికారం లక్ష్యంగా రచించుకున్న వ్యూహం. దీనివల్ల ప్రజలకు లభించే ప్రయోజనాలేమిటో చెప్పరు. కానీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళిక స్పష్టంగా, పారదర్శకంగా వున్నది. కూటమివాదంలాగా ఇది ఊకదంపుడు ఉపన్యాసం కాదు. ఎంతో విస్తృత అధ్యయనం తర్వాత కేసీఆర్ ప్రతిపాదిస్తున్న పరిపాలనా విధానం. రాష్ట్రాలు అధికారాలను పునర్నిర్వచించే వైట్‌పేపర్. రాష్ట్ర పరిపాలనలో కూడా జాతీయ దృక్పథంతో ముందుకు సాగడంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ పథకాలు దిక్సూచిలుగా మారిన తర్వాత అనేక రాష్ట్రాలు వాటిని అమలుపరుస్తున్నాయి. సాక్షాత్తూ మోదీ ప్రభుత్వమే రైతుబంధును కాపీ చేస్తూ ఒక పథకాన్ని అమలుచేయటం వల్ల కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయస్థాయి పథకాలు అన్న గుర్తింపు పొందాయి. ఇవన్నీ కులమతాలకు అతీతమైన స్వభావం కలిగి వుండటంలో అంతర్జాతీయంగా కూడా గుర్తింపుపొందాయి.
హిందుత్వపార్టీగా ప్రచారం చేసుకొని బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇన్నేండ్ల పరిపాలనా కాలంలో రామజన్మభూమి సమస్యను పరిష్కరించలేకపోయింది. సుప్రీంకోర్టు మాత్రం ఎంతో విజ్ఞతతో మైనారిటీవర్గానికి చెందిన పూర్వ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది లౌకికవాదానికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం. హిందుత్వ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మాటలతో కాదు, చేతలలోనే నిరూపించుకున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని తిరుమల తిరుపతి స్థాయిలో పునర్నిర్మించటం వంటి ఎన్నో అంశాలు వారి ఎంతటి నిబద్ధ హిందువులో నిరూపిస్తున్నారు. వారి లౌకికవాద దృష్టిని నిరూపించే ఎన్నో రుజువులున్నాయి. కేసీఆర్ ఇంతవరకు ఆర్థికంగా కుంగిపోయి దేవాలయాలలో, చర్చీలలో, మసీదులలో పనిచేస్తున్న దైవ సేవకులకు నెలవారీగా క్రమబద్ధీకరించిన జీతాలు ఏర్పాటు చేశారు. ఇది సర్వమతాలను సమదృష్టితో చూసే జాతీయవాదమే.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెనుక కూడా కేసీఆర్ జాతీయ దృక్పథం వెల్లడవుతున్నది. రైతు జాతికి గర్వకారణమైన ప్రతినిధి. కొన్ని తెలంగాణ ప్రాజెక్టులు దిగువ నుంచి ఎగువకు కూడా సాగునీటిని తీసుకురావచ్చనే శాస్త్రీయ సాంకేతిక సత్యానికి ఆచరణాత్మక రుజువులుగా వున్నాయి. దేశంలో ఏ ఇతర ప్రాంతంలోనైనా ఇట్లాంటి సమస్యలుంటే వాటిని పరిష్కరించవచ్చునన్నది కేసీఆర్ సందేశం. ఈరోజు కాని పక్షంలో రేపైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా రాక తప్పదు. నదుల అనుసంధానం వల్ల కరువు రక్కసిని పారదోలవచ్చు అన్నది కేసీఆర్ ప్రతిపాదన. దీన్ని ఒక జాతీయ పాలసీగా చూడవలసి వున్నది. ఎండిన డొక్కలకు గంజి నిన్నటి పాట. ఆకలి కడుపులకు అమృతం కేసీఆర్ మాట!
1971-75 సంవత్సరాల్లో మనకంటే తక్కవ జీడీపీ వున్న చైనా ఇప్పుడు పోల్చి చూసుకుంటే మనకన్నా నాలుగురెట్లు అధిక జీడీపీని సాధించింది. అంటే మన దేశ పాలకుల పాలసీలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని అర్థం. ఏ ప్రభుత్వమైనా కాలం కన్నా ముందుండాలె. కనీసం కాలంతోపాటు కలిసి నడువాలె. కానీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలంకన్నా వెనుకబడి ఉండటమే జీడీపీ క్షీణించటానికి కారణం. ఏ రంగంలో కూడా కేంద్రం పంపిణీ విధానం సరిగ్గా లేదన్నది కేసీఆర్ వాదం. విద్యుత్ విషయానికి వస్తే దేశంలో 3.44 లక్షల మెగావాట్లున్నా ఇంకా సగం రాష్ట్రాలలో చీకటేనని, వ్యవసాయానికి 4 గంటలకు మించి కరెంటు ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ అభియోగం. దేశంలో 70 వేల టీసీఎంల నీటి లభ్యత వున్నది. 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నా సర్కార్లు మాత్రం 4 కోట్ల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నాయి. పూర్తిస్థాయిలో సంక్షేమం సాధించాలంటే నదుల అనుసంధానం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పథకాలు అవసరం. ప్రజా సంక్షేమం అన్నది నినాదం గాక విధానంగా మారాలె. ఇందుకు కేసీఆర్ వంటి దిల్దార్, కల్దార్ నాయకుడే అవసరం.
ఆధునిక జీవితంలో వేగం ప్రధానమైనది. ఆ వేగాన్ని అందుకోవటానికి నీరసించిన నిన్నటి ఆలోచనాధోరణి పనికిరాదు. కాలానుగుణమైన తక్షణ చర్యలతో భవిష్యత్తును నిర్మించేవారితోనే ప్రజలు మమేకమవుతారు. తెలంగాణను సంక్షేమ పథకాల ప్రయోగశాలగా చేసి గొప్ప ఫలితాలు రాబట్టిన కేసీఆర్‌కు దేశం పట్టంకట్టే ఘట్టం కనుచూపు మేరలో కనిపిస్తున్నది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..