గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి దాదాపు రెండుగంటలకుపైగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకం అమలు చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని, దగ్గరుండి పనులు చేయించుకోవాలని, మిషన్ కాకతీయకు సంబంధించి ఉత్సాహంగా పనులు చేయించుకునే ఎమ్మెల్యేలకు పదిశాతం ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పారు. రానున్న ఆరునెలల్లోనే సుమారు 8, 9 నియోజకవర్గాల్లో వాటర్ గ్రిడ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని, క్షేత్ర స్థాయి పర్యటనలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల మధ్యకు వెళ్లాలని, ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను విడమరిచి చెప్పాలని సూచించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వాళ్ళు అట్లాగే మాట్లాడుతారు. అయితే అవసరమైనప్పుడు మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళ ఆరోపణలని, విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి వివరించమని, ప్రజాప్రతినిధులకు వాళ్ళు చేసిన పనులే గీటురాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీలతో కలిపి బహుశా ఈ నెలాఖరుకు వరంగల్ లోక్ సభ స్థానం, నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.. ఈ రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో వచ్చిందని, నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పార్టీ వ్యవహారాల్లో పాత, కొత్త వారందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకునిపోతేనే పార్టీ పటిష్ఠంగా ఉంటుందని, ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకునిపోతేనే మరోసారి గెలుస్తారని సీఎం చెప్పారు. దసరా పండుగ నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్ళ చొప్పున ప్రారంభిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా దసరా పండుగ తర్వాత తాను జిల్లాల పర్యటనకు వస్తానని, జిల్లా కలెక్టర్లతో త్వరలోనే కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. మార్కెట్, దేవాదాయ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని, 17నుండి 18 వరకు ఉన్న కార్పొరేషన్లను ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భర్తీ చేద్దామని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.