ఒక్కొక్క డివిజన్ లో జనాభా సంఖ్య వేర్వేరుగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ల పునర్విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ విభజన ఆదర్శవంతంగా ఉండాలని, దాని తర్వాతే బల్దియా ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించిన అనంతరం పార్టీ శ్రేణులకు తెలిపినట్లు సమాచారం.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలుపై సలహాలు, సూచనలను కేసీఆర్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏం చేయబోతున్నదో కూడా త్వరలోనే చూస్తారు అని సీఎం అన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాలపై మరింత దృష్టి పెట్టాలని, పార్టీని కింది స్థాయినుండి బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
వచ్చే మూడు నాలుగు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. పైరవీలు ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దని, దానివల్ల పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ రెండూ పాడవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. మన పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయని, దాన్ని నిలబెట్టుకోవాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా అధికారులు మైండ్ సెట్ మార్చుకోవాల్సిందేనని, అలా మార్చుకోని, సరిగా పనిచేయని వారి పేర్లు ఇస్తే బదిలీలు చేస్తామని కేసీఆర్ అన్నారు.