mt_logo

కష్టసాధ్యమవుతున్న ఉద్యోగుల విభజన

రాష్ట్ర విభజన ప్రక్రియ తుడిదశకు చేరుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని అంశాలకు సంబంధించి నివేదికలు రూపొందించే సమయంలో రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను ఉన్నతాధికారులు మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన సీమాంధ్ర ఉద్యోగులు వారి సర్వీస్ బుక్ లలో వివరాలు మాయం చేసినట్లు కనుక్కున్నారు. స్థానికత, జన్మస్థలం, సర్వీసు వివరాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఉన్నతాధికారులు నివ్వెరబోయారు. ఉద్యోగుల పంపిణీ అంశం అంత తేలికైన విషయం కాదని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కొలువులు పొందిన వారిలో సీమాంధ్రులే ఉన్నారని, 78 వేల ఉద్యోగుల్లో 8,580 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని అనేక కమిటీలు స్పష్టం చేసాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ విభాగంలో 54 కేటగిరీల్లో సీమాంధ్ర ఉద్యోగులే అధికంగా చేరినట్లు ప్రభుత్వ లెక్కల్లోనే సూచించబడింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేటగిరీల్లో తెలంగాణ అధికారులు 60 మంది ఉండాల్సినా గత 60 సంవత్సరాల్లో ఎప్పుడూ అలా ఉన్న సందర్భాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన సీమాంధ్ర పెన్షనర్ల భారం అదనంగా వచ్చి చేరనుంది. ఒక్క హైదరాబాద్ లోనే 90 వేల మంది పదవీవిరమణ చేసిన సీమాంధ్ర ఉద్యోగులు ఉండగా వీరికి తెలంగాణ రాష్ట్రం పెన్షన్లు ఇవ్వాలంటే అస్సలు కుదరదని, ప్రతీ సంవత్సరం పదవీ విరమణ చేస్తున్న వారిలో 90 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని తెలంగాణ జేఏసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగంలో 65 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారని ఒక్క సచివాలయంలోనే 4,644 మంది ఉద్యోగుల్లో తెలంగాణ ఉద్యోగులు 600 మాత్రమేనని సచివాలయ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అన్నివివరాలనూ రూపొందించిన ఒక నివేదికను తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందించింది. హైదరాబాద్ లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చాయో నిగ్గు తేల్చాలని, లేనిపక్షంలో మరో మహోద్యమానికి సిద్ధమవుతామని కేంద్రాన్ని ఉద్యోగసంఘాల జేఏసీ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *