హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి నదీ జలాల తరలింపుకై నిర్మించతలపెట్టిన పైప్ లైన్ కు కేంద్ర రక్షణ శాఖ అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో జారీ అవ్వనున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన వరుస విజ్ఞప్తులతోనే రక్షణ శాఖ ఈ అనుమతులు మంజూరు చేసింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుండి హైదరాబాద్ కు గోదావరి నదీ జలాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3725 కోట్ల వ్యయంతో పైప్ లైన్ ను నిర్మించతలపెట్టింది.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని కౌకూర్ గ్రామం వద్ద సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని భూభాగంలో ఒకటిన్నర ఎకరం భూమి పరిధిలో పైప్ లైన్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతులు తప్పనిసరిగా కావలసి ఉంటుంది. ఈ సంవత్సరం మే నెలలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ వివరాలు ఆయనకు తెలిపి అనుమతులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన రక్షణ శాఖ తాజాగా అనుమతులు మంజూరు చేసింది.